మైక్ ఆన్‌లో ఉన్న సంగతి మర్చిపోయి.. జి7 సదస్సులో ప్రపంచ నేతల సీక్రెట్ ముచ్చట్లు!

  • హాట్ మైక్ ఆన్‌లో ఉన్న సంగతి మర్చిపోయిన నేతలు
  • మెలోని ధూమపానం మానేసినట్లు వెల్లడి
  • మాక్రాన్ వాచ్‌పై ట్రంప్ ఫన్నీ కామెంట్స్
  • నేతల మధ్య సరదా సంభాషణల లీక్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరుగుతున్న జి7 (G7) అంతర్జాతీయ సదస్సులో అత్యంత ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక, భద్రతాపరమైన సీరియస్ అంశాలపై చర్చలు జరుపుతున్న గ్లోబల్ లీడర్లు.. బ్రేక్ టైమ్‌లో తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. అయితే ఆ సమయంలో అక్కడి మైకులు ఆన్ (Hot Mics)లోనే ఉండటంతో, వారు మాట్లాడుకున్న వ్యక్తిగత విషయాలన్నీ రికార్డై బయటకు వచ్చాయి. దౌత్యపరమైన వ్యూహాల మధ్య ప్రపంచ దేశాల అధినేతల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ సరదా ముచ్చట్లు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ లీకైన సంభాషణల ప్రకారం.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మే 1వ తేదీ నుంచి ధూమపానం (Smoking) పూర్తిగా మానేశానని తోటి నేతలకు చెప్పారు. దీనిపై స్పందించిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌లు ఆమెకు అభినందనలు తెలుపుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాము కూడా గతంలో సిగరెట్లు మానడానికి ఎంతలా కష్టపడ్డామో లీడర్లంతా ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక సైకిల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం కూడా మైక్‌లో రికార్డైంది.

మరో ఆసక్తికరమైన ఘటనలో.. వర్కింగ్ లంచ్‌ పూర్తి చేసుకుని వెళ్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన చేతి గడియారాన్ని టేబుల్‌పైనే మర్చిపోయారు. దీనిని గమనించిన ట్రంప్ తనదైన శైలిలో ఒక క్రేజీ పంచ్ వేయడంతో అక్కడున్న నేతలంతా పగలబడి నవ్వారు. ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలోనిల మధ్య నడుస్తున్న 'మెలోడీ' (#Melodi) క్రేజ్ ఒకవైపు సోషల్ మీడియాను ఊపేస్తుండగానే.. ఇప్పుడు లీకైన ఈ హాట్ మైక్ సంభాషణలు ప్రపంచ నేతల వ్యక్తిగత కోణాన్ని ప్రజల ముందుకు తెచ్చాయి. ఎలాంటి వివాదాలు లేకుండా కేవలం సరదాగా సాగిన ఈ వీడియో క్లిప్స్ ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

G7 Summit
Giorgia Meloni
Donald Trump
Hot Mic Leaks
Emmanuel Macron
World Leaders

More Telugu News